హామీలకు తూట్లు.. ప్రజలకు వెన్నుపోటు

కూటమి ప్రభుత్వంపై వైసీపీ యుద్ధభేరి
జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..
వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4 నుంచి 12 వరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించిన అయన పార్టీ శ్రేణులకు కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో మానిఫెస్టో దహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, మహిళలకు పింఛన్లు, రైతు సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మెడికల్ కళాశాలల అభివృద్ధి నిలిచిపోయిందని, సంక్షేమ కార్యక్రమాల్లో వేలాది మంది లబ్ధిదారులు నష్టపోయారని పేర్కొన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply