కీలక సూచికల అప్‌డేట్‌లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

కీలక సూచికల అప్‌డేట్‌లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
- కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను సకాలంలో అప్‌డేట్ చేయాలి
- జనగణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
- ప్రజా సంతృప్తి స్థాయిని మరింత పెంచాలి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా అభివృద్ధి సూచికలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతి శాఖ తమకు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐలు) వివరాలను సకాలంలో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్‌వో రాము నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ శాఖల పనితీరును అంచనా వేసే కీలక సూచికలైన కేపీఐల వివరాలను ఈ నెల 5వ తేదీలోగా తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి సూచికల్లో మరింత పురోగతి సాధించేందుకు వ్యవసాయ, పరిశ్రమలు, పశుసంవర్థక శాఖలు పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయాలని సూచించారు.
సంబంధిత వివరాలను జిల్లా స్థాయి అధికారులు స్వయంగా పరిశీలించి అప్‌లోడ్ చేయాలని, క్రింది స్థాయి సిబ్బందిపై పూర్తిగా ఆధారపడకూడదని స్పష్టం చేశారు.
జనగణన పనులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న 2026 జనగణన గణాంకాల ప్రకారం, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే జిల్లాలోని 215 గ్రామాల్లో తక్కువ జనాభా నమోదైనట్లు వెల్లడించారు.
ముఖ్యంగా దొర్నిపాడు, ఉయ్యాలవాడ, గోస్పాడు, బండి ఆత్మకూరు, పగిడ్యాల, నందికొట్కూరు, మిడ్తూరు, జూపాడుబంగ్లా, బేతంచర్ల, పాణ్యం, డోన్, సంజామల, కోవెలకుంట్ల, రుద్రవరం మండలాలతో పాటు బనగానపల్లె మండలంలో కూడా జనాభా నమోదు శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ అంశంపై పునఃపరిశీలన చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో మరింత సానుకూల దృక్పథం ఏర్పడేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గతంలో 71.20 శాతంగా ఉన్న జిల్లా పాజిటివ్ పర్సెప్షన్ ప్రస్తుతం 69.52 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తక్కువ పురోగతి నమోదు చేసిన శాఖలు, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “బడి పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని మరింత పెంచాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం 89 శాతం పురోగతి నమోదైందని, దానిని 90 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు సుమారు 8 వేల మంది చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు కాగా, ఇంకా మిగిలిన వెయ్యి మంది చిన్నారులను కూడా కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా 1,058 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
సచివాలయాలకు వచ్చే ప్రజలకు తమ మొబైల్ ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలను పొందే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
