వలిగొండ రోడ్డు పనులు పునఃప్రారంభం..

వలిగొండ రోడ్డు పనులు పునఃప్రారంభం..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న చైర్పర్సన్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వలిగొండ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కోర్టుకు వెళ్లే దారి వరకు అధ్వాన్నంగా మారిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె ఆదివారం దగ్గరుండి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, గతంలో ఈ వలిగొండ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేపట్టినా, భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. దీనివల్ల వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టామని పావని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌తో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. రాబోయే 15 రోజుల్లోగా బీటీ రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా ప్రమాదకరంగా మారిన ఈ రహదారికి మళ్లీ మరమ్మతులు ప్రారంభించడంపై స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
