అలీపుర కాలనీలలో సమస్యలతో సహవాసం

అలీపుర కాలనీలలో సమస్యలతో సహవాసం
- అధ్వానంగా అంతర్గత రోడ్లు, సైడ్ కాలువలు
- రోడ్డుపైనే చెత్తకుప్పలు
- దోమల స్వైర విహరం
హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న గ్రేటర్ వరంగల్ 59వ డివిజన్ అలీపూర్ కాలనీ మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతర్గత రోడ్లు, సైడ్ కాలువలు లేకపోవడంతో కాలనీ వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతోందని, దీంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు తెలిపారు. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.
రోడ్లపై చెత్తకుప్పలు
కాలనీలో పలుచోట్ల రోడ్లపైనే చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో పందులు, దోమలు అధికంగా సంచరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి : వేణు
అలీపూర్ కాలనీకి చెందిన స్థానికుడు వేణు మాట్లాడుతూ, కాలనీలోని సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఈ కాలనీ ఎన్నో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతోందని తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
