కసితో పనిచేసి మళ్లీ గెలవాలి..

కసితో పనిచేసి మళ్లీ గెలవాలి..
- రెండోసారి గెలుపే రాజకీయ భవిష్యత్తుకు కీలకం
- మైనంపల్లి రోహిత్‌కు జగ్గారెడ్డి రాజకీయ సూచనలు
- ఆసక్తికరంగా మారిన జగ్గారెడ్డి మాటలు
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : కసితో పనిచేసే మళ్లీ గెలవాలని, రెండోసారి గెలుపే రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయ సూచనలు చేశారు. గాంధీ భవన్‌లో శనివారం జరిగిన ఓ అనుకోని భేటీలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడే ఉన్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… మొదటిసారి సాధించిన విజయాన్ని మరిచి, రెండోసారి ఎన్నికను తొలి ఎన్నికగా భావించి మరింత కసితో పనిచేయాలని రోహిత్‌కు సూచించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే రెండోసారి విజయం సాధించడం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే రాజకీయ జీవితంలో అదే పెద్ద మలుపుగా మారుతుందని, భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. అనంతరం మైనంపల్లి రోహిత్, జగ్గారెడ్డిని తన నివాసానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. గాంధీ భవన్‌లో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
