విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యం: వంగూరి ఆనందరావు మాదిగ

విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యం: వంగూరి ఆనందరావు మాదిగ
ప్రతి మాదిగ, ఉపకులాల పల్లెలను తాకుతాం,చదువు ప్రాధాన్యతను వివరిస్తాం
గోటు విలేజ్ కార్యక్రమంలో భాగంగా గురజాలలో అవగాహన సమావేశం,
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ :మాదిగ మరియు మాదిగ ఉపకులాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను అధిరోహించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ వంగూరి ఆనందరావు మాదిగ పిలుపునిచ్చారు. ప్రతి మాదిగ, ఉపకులాల పల్లెలను సందర్శిస్తూ విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో చిన్నపల్లి రవి మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్య ద్వారానే మానవ జీవితంలో అన్ని అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పారు.
చదువుతోనే వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతాయని వివరించారు. జూన్, జూలై నెలల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టనున్న “గోటు విలేజ్” కార్యక్రమంలో భాగంగానే ఈ గ్రామ పర్యటనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదిగ, ఉపకులాల విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆనందరావు మాదిగ మాట్లాడుతూ, భారతీయ కుల వ్యవస్థలో సామాజిక న్యాయం కోసం, ఎస్సీ జాబితాలోని 59 కులాలకు సమన్యాయ పంపిణీ జరగాలనే డిమాండ్‌తో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ఉద్యమాలు చరిత్రాత్మకమని అన్నారు. ఆ ఉద్యమాల ఫలితంగా సాధించిన ఎస్సీ వర్గీకరణ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలంటే విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.
చదువే మార్పుకు బాట,
చదువుతోనే మాదిగ సమాజ అభ్యున్నతి,
పల్లె పల్లెకు విద్య చైతన్య యాత్ర,
చదువు మానొద్దు ఉన్నత శిఖరాలు అధిరోహించండి,
విద్యార్థుల భవిష్యత్తే సమాజం భవిష్యత్తు,
మాదిగ ఉపకులాల సాధికారితకు విద్యే ప్రధాన ఆయుధం,…
మాదిగ సమాజం చారిత్రకంగా ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోందని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విద్యాపరమైన వెనుకబాటు కనిపిస్తోందని, ముఖ్యంగా ఉపకులాల విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యతో పాటు సామాజిక చైతన్యం, స్వాభిమానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధు మాదిగ, ప్రభాకర్ మాదిగ, దూడల కుమారస్వామి మాదిగ, డక్క సంపత్ మాదిగ, దౌడ్ సురేష్ మాదిగ, నవీన్ మాదిగ, ప్రసన్న మాదిగ, సురేష్ మాదిగ, కొమురక్క మాదిగ, లక్ష్మీ మాదిగ, ప్రదీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
