IPL 2026 | రికార్డుల‌ వైభవం !!

IPL 2026 | రికార్డుల‌ వైభవం !!

  • వండ‌ర్ వైభ‌వ్ !
  • ఐపీఎల్ 2026లో 700 పరుగులు..
  • పవర్‌ప్లేలోనే 500 రన్స్

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల సందర్భంగా వైభవ్ ప‌లు అరుదైన మైలురాళ్లను అందుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

పవర్‌ప్లే కింగ్…

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న కీల‌క క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కళ్ళు చెదిరే ప్రదర్శనతో క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టించాడు. ఈ సీజన్‌లో అతను కేవలం పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) లోనే ఏకంగా 510 పరుగులు సాధించి, ఒకే ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు.

దీనితో 2016 ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ నెలకొల్పిన 467 పరుగుల ఆల్-టైమ్ రికార్డుతో పాటు ట్రావిస్ హెడ్ (2024లో 402 రన్స్), సాయి సుదర్శన్ (2025లో 402 రన్స్), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2009లో 382 రన్స్) ల రికార్డులను ముక్కుపచ్చలారని వ‌య‌స్సులోనే వైభవ్ పూర్తిగా తుడిచిపెట్టేశాడు.

ఈ పవర్‌ప్లే విధ్వంసం ఒకెత్తయితే, అందులో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా వైభవ్ సృష్టించిన ప్రపంచ రికార్డు క్రికెట్ ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ 2026 సీజ‌న్ లో వైభవ్ సింగిల్స్, డబుల్స్ కోసం పెద్దగా కష్టపడకుండా కేవలం సిక్సర్లు, ఫోర్ల రూపంలోనే ఏకంగా 610 పరుగులు రాబట్టాడు. ఇందులో 107 ఫోర్లు, 65 సిక్సర్లు ఉండటం విశేషం.

ఈ అద్భుత ఘనతతో 2022లో జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున సాధించిన 602 బౌండరీ పరుగుల రికార్డును, 2016లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సాధించిన 560 బౌండరీ పరుగుల రికార్డులను వైభవ్ అధిగమించాడు.

ఒకే ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లే రారాజుగా 510 పరుగులు, బౌండరీల కింగ్‌గా 610 పరుగులు సాధించడమే కాకుండా, ఈ సీజన్‌లో మొత్తం 700 పరుగుల మైలురాయిని దాటిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. అలాగే, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా (Uncapped Player) ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ (2023లో 626 పరుగులు) రికార్డును వైభవ్ అధిగమించాడు.

అంతే కాకుండా.. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (59 సిక్సర్లు) కొట్టిన క్రిస్ గేల్ పాత రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో వైభ‌వ్ ఏకంగా 65కు పైగా సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Leave a Reply