క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి

  • రూ.13.20 లక్షల నగదు స్వాధీనం
  • ముగ్గురు అరెస్ట్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో రూ.13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. హిందూపురం రూరల్ యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్ర అంజినేయులుకు అందిన ఖచ్చితమైన సమాచారం, జిల్లా నిఘా వర్గాల సూచనల మేరకు తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.దాడుల్లో అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిని సందీప్ కుమార్ రెడ్డి (32), తిమ్మారెడ్డి (33), యర్రబల్లి శ్రీనివాసరెడ్డి (37)గా పోలీసులు గుర్తించారు. వీరిపై హిందూపురం యూపీఎస్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 30/2026 కింద ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు వెల్లడైందని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, మట్కా, జూద కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పునరావృతంగా ఇలాంటి నేరాల్లో పాల్గొనే వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 112 కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన హిందూపురం యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్ర అంజినేయులు, సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Leave a Reply