Chityala | హైవేపై నామమాత్రపు టీజీఎస్‌ఆర్‌టీసీ కౌంటర్..

Chityala | హైవేపై నామమాత్రపు టీజీఎస్‌ఆర్‌టీసీ కౌంటర్..

  • కర్రల గూడులా మారిన తాత్కాలిక షెడ్డు
  • ఎండలోనే ప్రయాణికుల అవస్థలు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
  • తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్

చిట్యాల, (ఆంధ్రప్రభ) : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైవే సమీపంలో ఏర్పాటు చేసిన టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) నాన్-స్టాప్ టికెట్ కౌంటర్ పేరుకే పరిమితమైంది. అక్కడ ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా చిట్యాల మండల కేంద్రం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది.

బస్టాండ్‌లోకి రాని బస్సులు..

జాతీయ రహదారి (హైవే) విస్తరణ పనుల కారణంగా హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిట్యాల లోపలి బస్టాండ్‌లోకి రావడం లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం హైవేపై బస్టాండ్ ఎదురుగా ఒక తాత్కాలిక నాన్-స్టాప్ కౌంటర్‌ను, దానికి తోడు ఒక తడకల షెడ్డును అధికారులు ఏర్పాటు చేశారు.

కానీ అది కేవలం మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ షెడ్డు పూర్తిగా ధ్వంసమై కేవలం కర్రల గూడులా దర్శనమిస్తోంది. కనీసం నిలబడటానికి నీడ లేకపోవడంతో తీవ్రమైన ఎండలో ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు రహదారిపైనే అల్లాడిపోతున్నారు.

Chityala

సమాచారం ఇచ్చే వారే లేరు..

సదరు కౌంటర్‌లో టికెట్లు ఇచ్చే సిబ్బంది గానీ, బస్సుల రాకపోకలపై సమాచారం అందించే కంట్రోలర్ గానీ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మండుటెండలో బస్సుల కోసం ఎదురుచూస్తూ, ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌యాణికుల కష్టాలు అటు అధికారులకు, ఇటు నాయకులకు కనిపించడం లేదా? అని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ప్రయాణికుల డిమాండ్లు…

ధ్వంసమైన తడకల షెడ్డు స్థానంలో ప్రయాణికులకు తక్షణమే సురక్షితమైన షెల్ట‌ర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్ర‌యాణికులు. కౌంటర్ వ‌ద్ద నిరంతరం ఒక కంట్రోలర్‌ను అందుబాటులో ఉంచి, ప్రయాణికులకు సరైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చిట్యాల ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply