ఘనంగా శత చండీ మహాయాగం ప్రారంభం..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల లలిత ఆశ్రమ ఆలయంలో ఆలయ ధర్మాధికారి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న శత చండీ మహాయాగం ఘనంగా ప్రారంభమైంది.
మహాయాగంలో భాగంగా తొలి రోజు గురువందనం, సంతాన పాశుపత పూజ, సుమంగళి మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సాయంత్రం సహస్ర మోదక గణపతి హవనాన్ని వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మాధికారి రాజేందర్ శర్మ తెలిపారు. యాగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన పురోహితులు వేలేటి గౌరీశంకర్ శర్మ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గాలి నాగరాజు, కొమ్మ సుధాకర్, శేఖర్, కస్తూరి శ్రీనివాస్, మోటూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
