భక్తుల రద్దీతో కీలక నిర్ణయం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ సోమవారం వరకు నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, విరామ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ నాలుగు రోజుల పాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని ఆయన వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించాలని కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూకాంప్లెక్స్‌లో ఉదయం వేళల్లో వేడి పాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో కూడా తాగునీటి సౌకర్యం కల్పించినట్లు వివరించారు.

క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల ద్వారా మంచినీటితో పాటు మజ్జిగను కూడా భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.

Leave a Reply