క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన..

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హామీ (ఈజీఎస్) పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులకు ప్రతిరోజూ ఎంతమంది కూలీలు హాజరవుతున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో ఉన్న కూలీలతో నేరుగా మాట్లాడి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

ఉపాధి హామీ పనులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా, మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారా అనే అంశాలపై కూలీలతో చర్చించారు.

పనుల నిర్వహణ సమయంలో ఫోటోలు తీసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మ్ పాండ్ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.

ఉపాధి హామీ పనులకు 480 మంది కూలీలు హాజరుకావడం, కూలీల కోసం తాగునీరు, టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పనులు వేగంగా, సమర్థవంతంగా కొనసాగుతున్నందుకు డీఆర్‌డీఓ మేన్ శ్రీను, కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, ఈజీఎస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

Leave a Reply