2026ipl | “గుజరాత్ వర్సెస్ వైభవ్”

2026ipl | “గుజరాత్ వర్సెస్ వైభవ్”
2026ipl | గుజరాత్ జట్టుకు వైభవ్ ఫియర్
గజగజ వణికిస్తున్న యువ బ్యాటర్‌ను
త్వరగా ఔట్ చేసేందుకు వ్యూహాలు
2026ipl | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు గుజరాత్ టైటాన్స్ శిబిరంలో ఒకే పేరు తీవ్ర చర్చకు దారి తీస్తోంది — వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఈ యువ సంచలనం ప్రస్తుతం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతడు ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ తర్వాత గుజరాత్ జట్టు పూర్తిగా అప్రమత్తమైంది.
క్వాలిఫయర్-2లో అందరి చూపు ఇప్పుడు వైభవ్పైనే ఉంది. యువ ఆటగాడైనా ఒత్తిడిని లెక్కచేయకుండా ఆడటం అతడి ప్రత్యేకతగా మారింది. రాజస్థాన్ అభిమానులు మరోసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.అదే సమయంలో గుజరాత్ మాత్రం అతడిని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపాలా అన్న దానిపైనే ఫోకస్ పెట్టింది. వైభవ్ ఎక్కువసేపు క్రీజులో ఉంటే రాజస్థాన్‌కు భారీ ఆధిక్యం లభించే అవకాశం ఉంది.అతడిని తొందరగా ఔట్ చేస్తే గుజరాత్ మ్యాచ్‌పై పట్టు సాధించగలదు. అందుకే ఈ మ్యాచ్‌ను “గుజరాత్ వర్సెస్ రాజస్థాన్” కంటే “గుజరాత్ వర్సెస్ వైభవ్”గా అభిమానులు అభివర్ణిస్తున్నారు.

మే 29, 2026న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత ఐపీఎల్ 2026 ఫైనల్‌కు చేరుకుని ఆర్సీబీతో తలపడుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు నుంచే వైభవ్ సూర్యవంశీ ప్రధాన చర్చాంశంగా మారాడు.
రాజస్థాన్ జట్టులో అతడు అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదిగాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పవర్‌ప్లే నుంచే బౌలర్లపై దాడి ప్రారంభించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్, భారీ సిక్సర్లు, భయంలేని బ్యాటింగ్ ఇప్పుడు ప్రత్యర్థి జట్లలో భయం పెంచుతున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటికే అతడు భారీ సంఖ్యలో సిక్సర్లు బాది రికార్డులు బద్దలు కొట్టాడు.
గుజరాత్ జట్టులో ఆందోళన
వైభవ్‌ను త్వరగా ఔట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోతుందనే భయం గుజరాత్ శిబిరంలో కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడు దూకుడుగా ఆడితే స్కోరు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే అతడిపై ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచింగ్ స్టాఫ్, బౌలర్లు కలిసి ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. వైభవ్ బలహీనతలు, షాట్ ఎంపికలు, బౌండరీ ప్రాంతాలపై విశ్లేషణ జరుగుతోంది.
గుజరాత్ వ్యూహం ఏంటి?
మహ్మద్ సిరాజ్‌తో ప్రారంభ ఓవర్లలోనే దాడి చేయించే అవకాశం ఉంది. ఆఫ్‌స్టంప్ బయట వేగంగా బౌలింగ్ చేసి అతడిని పెద్ద షాట్లకు ప్రేరేపించాలనుకుంటున్నారు. రషీద్ ఖాన్ స్పిన్‌తో మధ్య ఓవర్లలో ఒత్తిడి పెంచే ప్లాన్ కూడా ఉండొచ్చు. షార్ట్ బాల్స్, స్లోవర్ డెలివరీలు, ఫీల్డ్ ట్రాప్‌లతో వైభవ్‌ను కట్టడి చేయాలని గుజరాత్ భావిస్తోంది.
సిరాజ్ వర్సెస్ వైభవ్
గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌పై దూకుడుగా ఆడాడు. కొన్ని భారీ షాట్లు బాదినా, చివరకు సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో ఈసారి ఇద్దరి మధ్య పోరు మ్యాచ్ హైలైట్‌గా మారే అవకాశముంది. పవర్‌ప్లేలో ఈ ద్వంద్వ పోరాటం మ్యాచ్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.
