ఓర్వలేకనే ప్రతిపక్షాల ఎదురు దాడి

ఓర్వలేకనే ప్రతిపక్షాల ఎదురు దాడి

– ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రైతు పక్షపాతంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఎదురు దాడికి దిగుతున్నాయని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దకల్వల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్ర సమాచార శాఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి కొనుగోళ్ల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తోందని పేర్కొంటూ, మిగతా ధాన్యం సేకరణలో కేంద్ర వైఖరిని తప్పుబట్టారు.

రాష్ట్ర రైతుల కోసం రూ. 16,479 కోట్ల అదనపు వ్యయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతులకు రూ. 11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

వర్షాలకు ధాన్యం తడిసినా, రంగు మారినా చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దని సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో మిల్లర్లు యాసంగి ధాన్యం సేకరణకు పూర్తి సహకారం అందించాలని, గత బకాయిల విషయంలో కొంత సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ఇసుక లారీలను ధాన్యం రవాణాకు వినియోగించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత రెండున్నరేళ్లలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.

అనంతరం కలెక్టరేట్‌లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ విజయరమణారావు, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply