గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్..

గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్..
- పులిగుండ్లపల్లి శివార్లలో పోలీసుల దాడి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ శివార్లలోని పెద్ద పులికొండల ప్రాంతంలో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాను తలుపుల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తలుపుల పోలీస్ స్టేషన్‌లో Cr.No.29/2026 కింద కేసు నమోదు చేయగా, BNS సెక్షన్లు 303(2), 62, 324(4)తో పాటు ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్–1878లోని సెక్షన్ 20 r/w 21 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజనాలపల్లి గ్రామానికి చెందిన వల్లెపు వెంకటరమణయ్య, అతని కుమారుడు హరిప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన గంగాద్రి కలిసి పులిగుండ్లపల్లి శివార్లలో గుప్త నిధులు ఉన్నాయనే నమ్మకంతో తవ్వకాలకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ అబ్దుల్ హమీద్‌ను సంప్రదించగా, అతడు తన స్నేహితులు బావుడి గౌస్ సాబ్, కళ్ళాలి సురేష్, మనేగర్ మల్లికార్జున, బి.ఆర్. జగదీష్, సి.హెచ్. సుబైర్ @ జుబేర్‌లతో కలిసి రెండు కార్లలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిందితులు అక్కడ పూజలు నిర్వహించి, రాతి విగ్రహాలను తొలగించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన గంగాద్రి అక్కడి నుంచి పరారయ్యాడు. మిగిలిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి AP21 BM 4579 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు, KA04 MV 6981 నంబర్ గల మారుతి బలెనో కారు, ఒక గునపం, ఒక పార, రెండు ప్లాస్టిక్ గోళాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ IPS ఆదేశాల మేరకు, కదిరి SDPO జె. శివనారాయణ స్వామి, కదిరి రూరల్ సీఐ పి. నాగేంద్ర పర్యవేక్షణలో తలుపుల ఎస్‌ఐ కె. చెన్నయ్య తన సిబ్బందితో కలిసి రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించారు. పరారీలో ఉన్న గంగాద్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
