నూతన రెడ్ క్రాస్ కమిటీతో కలెక్టర్ భేటీ..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖకు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్‌ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ డా. ఎం. తేజోమూర్తి, వైస్ చైర్మన్ కె. గోవర్ధన్ బాబి, కోశాధికారి ఆర్. రాజగోపాల్ నాయుడును ఎన్నికల అధికారి ఎం. వెంకటరమణ జిల్లా కలెక్టర్‌కు పరిచయం చేశారు. అనంతరం కలెక్టర్ నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో రక్తదాన శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించి రక్త నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే అంబులెన్స్ సేవలు, పేదలకు సహాయక కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు, ఇతర మానవతా కార్యక్రమాలలో రెడ్ క్రాస్ మరింత చురుకుగా వ్యవహరించాలని కోరారు.

రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు రక్త నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి ఆర్. సహదేవ నాయుడు, పరిపాలన అధికారి వి. గోపి, జిల్లా క్షేత్ర అధికారి వి. చిరంజీవి, జీవిత సభ్యుడు పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply