ఖాకీ కిడ్స్‌కు భవిష్యత్తుపై దిశానిర్దేశం

ఖాకీ కిడ్స్‌కు భవిష్యత్తుపై దిశానిర్దేశం

-‘స్పార్క్’ కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్ సూచనలు

సంగారెడ్డి ప్రతినిధి,ఆంధ్రప్రభ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పోలీసు సిబ్బంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధి సాధించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “స్పార్క్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని ఖాకీ కిడ్స్‌కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, విద్య ప్రాముఖ్యత, లక్ష్య సాధన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివితే విజయాన్ని సులభంగా సాధించవచ్చన్నారు. ఆధునిక సాంకేతికతను సానుకూల దిశగా వినియోగించుకొని విజయం వైపు అడుగులు వేయాలని సూచించారు. గత సంవత్సరాల మోడల్ పేపర్లను అధ్యయనం చేయడంతో పాటు నిత్యం వార్తాపత్రికలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని తెలిపారు.

ఖాకీ కిడ్స్‌కు మరింత ప్రోత్సాహం అందించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో స్టడీ హాల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే పోలీసు సిబ్బంది విధులతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పిల్లల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. అర్హత కలిగిన సిబ్బంది సమయానుసారంగా చదివి పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని అన్నారు. “స్పార్క్” కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని, అర్హత కలిగిన ఖాకీ కిడ్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బంది, ఖాకీ కిడ్స్, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply