కేటీఆర్ పదజాలం …సంస్కార హీనం

కేటీఆర్ పదజాలం …సంస్కార హీనం
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ పై కేటీఆర్ పదజాలం సంస్కార హీనమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శుక్రవారం మోత్కూర్ లోని గెస్ట్ హౌజ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న పదజాలం అత్యంత సంస్కారహీనంగా ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి అధినేత అని, అడ్మినిస్ట్రేటర్ అని గుర్తుచేసిన ఆయన, కేటీఆర్ వాడుతున్న హౌలేగాడు వంటి చిల్లర పదజాలాన్ని తక్షణమే మానుకోవాలని హితవు పలికారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరే ఇతర నేతలు ఇంత దిగజారి మాట్లాడలేదని గుర్తు చేశారు.
ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకుగా ఉండి ఇలాంటి పిల్ల చేష్టలు చేయడం సరికాదన్నారు.బండి భగీరథ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, నిందితుడిని అరెస్ట్ చేసే వరకు వదల్లేదని సామెల్ స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి, బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు ఉన్నా కేసు మరోలా ఉండేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ వడ్ల కల్లాలు చూడని కేటీఆర్, కేవలం రాజకీయాల కోసం వడదెబ్బ తగిలి చనిపోయిన రైతు వద్దకు వెళ్లి వలవల ఏడవడం మొసలి కన్నీరు కార్చడమేనని విమర్శించారు.
తెలంగాణ సమాజం కోసం ఎందరో అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే, నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు తిండి తిప్పలు లేక రోడ్లపై పోరాడితే, ఆ ఫలితాన్ని చూసి 2014లో ప్రజలు బీఆర్ఎస్ చేతిలో అధికారం పెట్టారని గుర్తు చేశారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని ఆగం చేసినందుకే 2023లో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని దూరం పెట్టారని సామెల్ వ్యాఖ్యానించారు.
నాడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన రోజే ఆ పార్టీ రాజకీయ బొంద తవ్వుకుందని ఎద్దేవా చేశారు. అధికారం పోయిందనే ఆక్రోశంతో సీఎం స్థాయిని మర్చిపోయి సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో తిరగబడితే సమాధానం చెప్పుకోలేరని, ఇప్పటికైనా కేటీఆర్ తన వక్రీకరణ విధానాన్ని, భాషను మార్చుకుని నైతిక విలువలతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సామెల్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గుండగోని రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి,సింగిల్ విండో చైర్మన్ పి వెంకటేశ్వర్లు, నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, గడ్డం సోమ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
