మహిళా సాధికారికతకు ప్రభుత్వం అండ

మహిళా సాధికారికతకు ప్రభుత్వం అండ

  • మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారికత, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన బాసటగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంది సమీపంలోని ఎల్‌.ఎన్‌. కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సంక్షేమానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అవసరమని, ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించేలా నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో గత ఏడాది వెయ్యి ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా, అందులో జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ఒక్కోటి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తున్నామని వివరించారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిర శక్తి మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు 163 కొత్త చికిత్సలను చేర్చినట్లు మంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 90 శాతం వైద్య సేవలు జిల్లాలోనే అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, ప్రతి 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 9 వేల నర్సింగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని, మొత్తం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు.

సిబ్బంది, మందుల కొరతపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సనత్‌నగర్‌లో వెయ్యి పడకల టిమ్స్ ఆసుపత్రిని జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా ప్రజలకు అందిస్తోందన్నారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వంగా ముందుకు సాగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో పారదర్శక పాలన అందించే దిశగా కృషి చేస్తోందన్నారు. జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులను మంత్రి, టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ పంపిణీ చేశారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముందు మంత్రి, టి.జి.ఐ.ఐ.సి చైర్‌పర్సన్ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రదర్శించిన ఆయిల్ పామ్ మొక్కలు, డ్రోన్ సాంకేతికత తదితరాలను పరిశీలించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డాక్యుమెంటరీలను ప్రదర్శించగా, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సి.డి.సి చైర్మన్ రామ్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, అధికారులు ప్రేమలతరెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply