రక్తహీనతపై బాలికలకు స్క్రీనింగ్ అవగాహన

మరిపెడ, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరిపెడ మున్సిపాలిటీ ఆడిటోరియంలో 15-18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికల కోసం శుక్రవారం ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 55 మంది బాలికలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో రక్తహీనత (ఎనీమియా) ఉన్నట్లు గుర్తించిన బాలికలకు ఉచితంగా ఐరన్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తొర్రూర్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, దీని నివారణకు ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వాడుతూ, తగిన పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. దీనితో పాటు, బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, శుభ్రమైన శానిటరీ ప్యాడ్స్ వాడకం వంటి అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో అవసరమని వివరించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపర్వైజర్ లక్ష్మి కుమారి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు సరిత, సౌజన్య, ఏఎన్ఎం లు నర్సబాయి, ఝాన్సీ, అశ్విని, శ్రీదేవి, మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply