ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

-వేసవి ఎండల మధ్య అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-క్యూలైన్లలోనే భక్తులకు అండగా నిలిచిన చైర్మన్‌, ఇంచార్జి ఈఓ,
-రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు తాత్కాలిక నిలిపివేత
-మజ్జిగ, తాగునీరు, అన్నప్రసాదాలతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ, ఆంధ్రప్రభ:

వేసవి సెలవులు, శుక్రవారం కలిసిరావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనానికి తరలిరావడంతో కొండంతా ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.

ఏర్పాట్ల పరిశీలిన…

అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఇన్‌చార్జ్ ఈఓ రంగారావు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టారు. రోజంతా క్యూలైన్ల వద్దే ఉండి భక్తులతో ముచ్చటిస్తూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. దర్శనం ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సంఖ్య అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ నిర్ణయంతో సాధారణ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వేగంగా దర్శనం లభించింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఉపశమన చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో చల్లని మజ్జిగ, శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. ఎక్కడా నీటి కొరత లేకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. భక్తుల సౌకర్యార్థం రోజంతా ఉచిత అన్నప్రసాద వితరణ, పులిహోర పంపిణీ కొనసాగింది. భక్తులు సంతృప్తి చెందేలా నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించారు.

ధర్మకర్తల మండలి సభ్యులు కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు నీరు, మజ్జిగ అందిస్తూ “భక్త సేవే మాధవ సేవ” అనే భావనను ఆచరణలో చూపించారు.భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో దేవస్థానం తీసుకున్న వేగవంతమైన చర్యలు దర్శన వ్యవస్థను సజావుగా కొనసాగించాయని భక్తులు అభినందిస్తున్నారు.

Leave a Reply