పుష్కరాల్లో నిర్లక్ష్యం పరాకాష్ట..

పుష్కరాల్లో నిర్లక్ష్యం పరాకాష్ట..

చల్లటి నీటి స్టాల్స్ బోసి బారినే..!
స్టాల్స్ వద్ద నిర్వాహకులే గైర్హాజరు
రెండు రోజులకే చేతులెత్తేసిన ఏర్పాట్లు
మండుటెండల్లో దాహంతో అలమటిస్తున్న భక్తులు

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్యపుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకూ బహిర్గతమవుతోంది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చల్లటి త్రాగునీటి స్టాల్స్‌లో నీరు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుండగా, స్టాల్స్ వద్ద నిర్వాహకులు ఎవరూ లేకపోవడం పరిస్థితి మరింత దారుణంగా మారిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పుష్కరాలు ప్రారంభమై కేవలం రెండు రోజులకే త్రాగునీటి కేంద్రాలు నిరుపయోగంగా మారడం గమనార్హం. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద వాటర్ క్యాన్స్ , ట్యాంకులు కనిపిస్తున్నా వాటిలో నీరు లేకపోవడం, నిర్వహణ చూసే సిబ్బంది ఎక్కడా కనిపించకపోవడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

మండుటెండలు తీవ్రంగా ఉండటంతో దాహంతో వచ్చిన భక్తులు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం” అంటూ అధికారులు ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు.

ఒక వైపు కోట్ల రూపాయల ఖర్చుల హడావిడి… మరో వైపు కనీస తాగునీరు కూడా అందని దుస్థితి… ఇదేనా పుష్కరాల నిర్వహణ అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్టాల్స్ వద్ద సిబ్బందిని నియమించి, నిరంతరాయంగా చల్లటి త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply