AP Education Department | జూనియర్లకు ప్రమోషన్లు.. సీనియర్లకు నిరీక్షణ

AP Education Department | జూనియర్లకు ప్రమోషన్లు.. సీనియర్లకు నిరీక్షణ

AP Education Department | సర్వీస్ రూల్స్ లేక ఎయిడెడ్ సిబ్బంది ఇబ్బందులు
ప్రత్యేక నిబంధనలపై ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న లెక్చరర్లు
ఉన్నత విద్యాశాఖలో పెరుగుతున్న అసంతృప్తి

AP Education Department | ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ బ్యూరో: ఉన్నత విద్యాశాఖలో పదోన్నతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూనియర్లకు ప్రమోషన్లు, సీనియర్లపై నిర్లక్ష్యం అన్న చందంగా ఈ శాఖ పని తీరు ఉంది. ముఖ్యంగా ఎయిడెడ్ నుంచి విలీనమైన సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. నాలుగున్నరేళ్లుగా విలీన సిబ్బందికి సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడంతో ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల్లో ఎయిడెడ్ నుండి విలీనమైన సిబ్బందిపై జరుగుతున్న అన్యాయం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సర్వీస్ రూల్స్ లేకపోవడంతో సీనియారిటీ ఉన్న సిబ్బంది ప్రమోషన్లకు నోచుకోకుండా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అదే సమయంలో జూనియర్ రెగ్యులర్ సిబ్బందికి వరుసగా ప్రమోషన్లు కల్పిస్తున్నారు. దీనివల్ల సీనియర్ సిబ్బంది కెరీర్ దెబ్బతింటోంది.

రెండేళ్లుగా తీవ్ర అన్యాయం..

నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన బోధన, బోధనేతర సిబ్బందికి సర్వీస్ రూల్స్‌ను రూపొందించడంలో తాత్సారం చేయడం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. డిగ్రీ విద్యలో 1,900 మంది బోధన, 1,800 మంది వరకు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఎయిడెడ్ నుంచి బోధనలోకి 600 మందికి పైగా, 630 మంది బోధనేతర సిబ్బంది వచ్చారు. అయితే, ఇక్కడ బోధనేతర సిబ్బందికి బదిలీలు, పదోన్నతులు లేవు. వీరితో పాటు ప్రభుత్వంలోకి విలీనమైన ఎయిడెడ్ ఉద్యోగులకు జూనియర్ కళాశాలల్లో గతేడాది పదోన్నతులు కల్పించారు. కానీ, డిగ్రీ విద్యలోని బోధనేతర సిబ్బందిపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పదోన్నతులు కట్టబెడుతుండటం గమనార్హం.

ప్రత్యేక సర్వీస్ రూల్స్..

ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది సేవా నిబంధనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనమైన కళాశాలల సిబ్బందికి ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. 1982 జూలై 18 తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొంది. అయితే సంబంధిత ఉద్యోగులు తమకు ప్రభుత్వం నిర్దేశించిన కొత్త సేవా నిబంధనలు కావాలా, లేక కళాశాల ప్రభుత్వంలో విలీనమయ్యే ముందు అమల్లో ఉన్న పాత నిబంధనలు కొనసాగాలా అనే విషయంలో ఎంపిక (ఆప్షన్) ఇవ్వాల్సి ఉంటుంది.

ఉద్యోగుల నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీల అంశాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు – ఆంధ్రప్రదేశ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ పరిధిలోకి వస్తారు. ఓరియంటల్ కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్లు, వొకేషనల్ జూనియర్ లెక్చరర్లు – ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ కిందకు వస్తారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమ్మతితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన కళాశాలల సిబ్బంది సేవా వ్యవహారాల్లో ఈ నిర్ణయం కీలక ప్రభావం చూపనుంది. ఇప్పటికైనా ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అవుతుందేమోనని సీనియర్లు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply