ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఆంధ్రప్రభ, విజయవాడ:

పదో తరగతితో పాటు ఏపీవోఎస్ఎస్ ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు విధులు నిర్వ‌ర్తించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఎస్ఎస్‌సీ, ఏపీవోఎస్ఎస్ – ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌లు ఈ నెల 25 నుంచి జూన్ 4 వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని అదేవిధంగా ఏపీవోఎస్ఎస్‌-ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మే 25వ తేదీ నుంచి జూన్ 1 వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయ‌న్నారు.

ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు 4,017 మంది, ఏపీవోఎస్ఎస్‌-ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు 1,259 మంది, ఏపీవోఎస్ఎస్‌-ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు 1,604 మంది మొత్తం 6,880 మంది విద్యార్థులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు 25 కేంద్రాలు, ఏపీవోఎస్ఎస్‌-ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు 8, ఏపీవోఎస్ఎస్‌-ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు ఉండాల‌న్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

ప్ర‌తి కేంద్రం వ‌ద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాల‌న్నారు. ప్రశ్న‌పత్రాల రవాణా నుంచి పరీక్షల ముగింపు వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పోలీసు, ఏపీఎస్ ఆర్‌టీసీ, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, ర‌వాణా రెవెన్యూ, మునిసిప‌ల్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించ‌డంలో నిబ‌ద్ధ‌త‌తో భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.

స‌మావేశంలో డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

Leave a Reply