వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
- బిజెపి ధర్నా, ఆర్డీఓకు వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
చౌటుప్పల్ మున్సిపల్, రూరల్ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చౌటుప్పల్ మున్సిపల్ అజ్ఞాతరాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్ ల ఆధ్వర్యంలో గురువారం మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తుంది వ్యవసాయం మార్కెట్ కార్యాలయం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చౌటుప్పల్ ఆర్డీఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి మాటలు చెప్పి కడుపు కొడుతోందని మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో వరి కోతలు పూర్తయి, రైతులు పండించిన ధాన్యం కల్లాల్లోకి వచ్చి నెల రోజులు కావస్తున్నా.. ఇంతవరకు కేవలం 30 శాతం మాత్రమే కాంటాలు పూర్తి కావడం దారుణమన్నారు. మరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నా, ధాన్యం కొనుగోళ్లు చేయలేకపోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటూ ప్రకటనలకే పరిమితం అవుతోందని, కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని ఆరోపించారు.
రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి..
ధాన్యం తూకాల్లో రైస్ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తూకం వేయాల్సి ఉండగా.. ఏకంగా 42 కిలోల తూకం వేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తూకాల్లో తేడాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసిపోతే ఆ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి తంగెళ్ళ వెంకటేశం, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, బుడ్డ సురేష్, పోలేపల్లి లక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, దూడెల భిక్షం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, మునగాల తిరుపతిరెడ్డి, కంది లక్ష్మారెడ్డి, యాస అశోక్ రెడ్డి, ఊడుగు వెంకటేశం, కడారి ఐలయ్య, మునగాల అమరేందర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
