చెరుకు, వరి పరిశోధనా విధానం పై రైతులకు అవగాహన

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో గురువారం చెరుకు, వరి పరిశోధనా స్థానం రుద్రూరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివిధ అంశాల పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ, వ్యవసాయంలో లాభదాయకత పెరగడానికి కేవలం అధిక దిగుబడి మాత్రమే కాకుండా, మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం అని రైతులకు వివరించారు.ముఖ్యంగా వరి సాగులో రైతులు స్థానికంగా రాష్ట్ర/జాతీయ మార్కెట్ లో ఎక్కువగా కొనుగోలు చేసే రకాల్ని ఎంచుకుంటే మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా వ్యవసాయ శాఖ వారు సిఫార్సు చేసిన రకాలనే ఎంపిక చేయాలి, నాణ్యమైన విత్తనాలు ఉపయోగించాలి.
రైతులు డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా తమ పంటకు మంచి ధర పొందవచ్చు. ఇది ఆదాయాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.కాబట్టి పంట ఎంపికలో మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సాగు చేయడం ద్వారా రైతులు లాభాలపై వ్యవసాయం చేయవచ్చు. సేంద్రియ వ్యవసాయం అనేది రసాయన ఎరువులు, కీటకనాశకాలు ఉప యోగించకుండా, సహజ వనరులు, ప్రకృతి ఆధారిత పద్ధతులతో పంటలను సాగు చేసే విధానం.ఈ విధానం ద్వారా నేల ఆరోగ్యం కాపాడబడుతుంది, పర్యావరణం సంరక్షించ బడుతుంది, అలాగే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.
ప్రధాన సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సేంద్రియ ఎరువుల వినియోగం, జీవ ఎరువులు, సహజ కీటక నియంత్రణ, పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు మరియు మల్చింగ్. సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు పర్యావరణాన్ని కాపాడుతూ, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఆరోగ్యకర మైన ఆహారం ఉత్పత్తి చేయవచ్చు.దీర్ఘకాలంలో ఇది సుస్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయ విధానం. రైతులు క్రమంగా రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ఉత్తమం అని తెలియజేశారు.
మండల వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ, రాబోయే వానకాలం సీజన్ లో ముఖ్యంగా రైతులు ప్రభుత్వం సూచించిన 8 సన్న రకాల వరి వంగడాలు అయిన బిపిటి-5204, ఆర్ఎన్ఆర్ -15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటి, డబ్ల్యూ జి యల్-962, డబ్ల్యూ జి ఎల్-44, జేజిఎల్-1798, దొడ్డు రకాలు అయిన ఎల్ ఆర్-64, ఎం టి యు-1010, కేఎన్ఎం-118 రకాలు మాత్రమే వేయాలని రైతులకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని బి.లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.దివ్య, చెరుకు వరి పరిశోధనా స్థానం రుద్రూరు శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య, గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్, ఉప సర్పంచ్ భాస్కర్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
