బలి తీసుకున్న నిర్లక్ష్యం..

బలి తీసుకున్న నిర్లక్ష్యం..
- విష వాయువు పీల్చి ఒకరు మృతి
- ఇద్దరు పరిస్థితి విషమం
- రైస్ మిల్లులో ఆక్వా వ్యర్ధాలు ప్రాసెసింగ్
- పరిశ్రమ అనుమతులపై స్పష్టత ఇవ్వని అధికారులు
- ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ బోర్డు తొలగించడం పై సందేహాలు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ:
కొందరి నిర్లక్ష్యానికి, మరికొందరి ధన దాహానికి నిండు ప్రాణాలు బలైపోతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు, తనిఖీలు లేకుండానే పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నో పరిశ్రమలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఏదో ఒక ప్రమాదం, సంఘటన గాని జరిగినప్పుడే అసలు విషయం బయటకు వస్తుంది. తాజాగా భీమవరంలో ఓ ఆక్వా వ్యర్ధాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ప్రమాదం ఇలా…
భీమవరం లోని ఆరేట్ నగర్ లో పాత రైస్ మిల్లులో ఆక్వా వ్యర్ధాల ప్రాసెసింగ్ యూనిట్ ను నిర్వహిస్తున్నారు. పైకి రైస్ మిల్ కలరింగ్ ఇస్తూ లోపల ఆక్వా వ్యర్ధాలను ప్రోసెసింగ్ చేస్తున్నారు. డ్రైనేజీ వ్యర్ధాలను వెళ్లే మార్గం పూడిక పోవడంతో భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఎనిమిది మంది కూలీలను ఆ పరిశ్రమ వారు తీసుకువచ్చారు. రైస్ మిల్లు ప్రాంతంలో షీల్డ్ తొలగించాలని తీసుకొచ్చి రైస్ మిల్లు వ్యర్ధాలకు సంబంధించి కాకుండా ఆక్వా వ్యర్ధాలకు సంబంధించి డ్రెయిన్ లో దింపారని బాధితులు చెబుతున్నారు. పనిచేస్తున్న సమయంలో విష వాయువులు వెలువడటంతో పని చేస్తున్న వలపు వెంకన్న (45) మృతి చెందాడు. ఇతనితో పాటు పనిచేయటానికి వచ్చిన వలపు రాజు, బత్తుల ప్రభాకర్ తీవ్ర అనారోగ్యం పాలవడంతో హుటాహుటిన భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చిన విషవాయువు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు.
ఇక్కడ నిర్వహించే ఈ పరిశ్రమపై స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు తమ ఆందోళనను తెలియజేసిన కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. పరిశ్రమ నిర్వహించే వారికి అన్ని రకాల అండదండలు ఉండటంతో తమను ఎవరు ఏమి చేయలేరని ధీమాతో ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పైసలతో కప్పిపుచ్చుకునే అవకాశం ఉండడంతో ఇటువంటి ప్రమాదాలు రాష్ట్రంలో తరచూ ఏదో ప్రాంతంలో జరుగుతూనే ఉంటున్నాయి.
తొలగించేసిన పరిశ్రమ బోర్డు
భీమవరం ఆరేటినగర్ లో పాత రైస్ మిల్లులో నడుస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉన్న బోర్డును గురువారం తెల్లారేసరికి తొలగించేశారు. అన్ని అనుమతులతో ఆక్వా వ్యర్ధాలను ప్రోత్సహించేస్తున్నామని చెబుతున్నవారు ఎందుకు పరిశ్రమ బోర్డును తొలగించాల్సి వచ్చిందో వారే చెప్పాలి. పొల్యూషన్ బోర్డ్, పరిశ్రమల శాఖల అధికారులు స్పష్టమైన వివరాలను ఎంతవరకు విడుదల చేయలేదు. అనుమతులు మేరకు పరిశ్రమలు నిర్వహిస్తున్నారో లేదో గుర్తించాల్సిన వారు కనీస తనిఖీలు పరిశీలనను చేసిన దాఖలాలు రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ కనిపించడం లేదు. అందుకే అనుమతులు ఒకటి.. పరిశ్రమలు నిర్వహించేది మరొకటి అన్నట్లుగా డొల్ల పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదాలు మరో మారు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్ట తనిఖీలు చేపట్టాలని ప్రజల కోరుతున్నారు.
బాధితులకు అండగా నినాదాలు.. అరెస్టులు
విషవాయువుల ప్రమాదంలో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ, నష్టపరిహారాన్ని ప్రకటించాలంటూ సిఐటియు సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. బాధితులకు అండగా నిలబడటానికి వచ్చిన సిఐటియు, సిపిఎం నాయకులు కలిదిండి రాజా రామ్మోహన్ రాయ్, బి వాసుదేవరావు, జే ఎన్ వి గోపాలన్ ఆంజనేయులు తదితరులను అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం ఖండించారు. పోలీసుల వైఖరిని, వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మానవత్వం మరిచి దౌర్జన్యం, అణచివేత చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.
ఇంచార్జ్ కలెక్టర్ పరామర్శ
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ రఘువీర్ విష్ణు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వైద్యుల నుండి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. తదుపరి అధికారులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అరాతీశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

