విజిబుల్ క్లీన్‌లినెస్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ

విజిబుల్ క్లీన్‌లినెస్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:
జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బేతంచర్ల మున్సిపాలిటీల పరిధిలో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ “విజిబుల్ క్లీన్‌లినెస్” కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, అన్ని మున్సిపల్ పట్టణాల్లో వచ్చే నాలుగు వారాల్లో విజిబుల్ క్లీన్‌లినెస్ లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి వారంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు వంటి ప్రజా రద్దీ ప్రదేశాల్లో పాన్, గుట్కా ఉమ్మివేతల వల్ల ఏర్పడిన ఎరుపు మచ్చలు, బహిరంగ మూత్రవిసర్జన ప్రాంతాల్లో కనిపించే పసుపు మచ్చలను గుర్తించి పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని తెలిపారు. రోడ్లను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు డివైడర్లు, కర్బ్‌లైన్లు, ఫుట్‌పాత్‌లకు పెయింటింగ్ చేపట్టాలని, స్పీడ్ బ్రేకర్లను మరమ్మతులు చేసి తెల్లటి గుర్తులు వేయాలని, రహదారుల ఇరువైపులా సైడ్ మార్కింగ్ పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండవ వారంలో అన్ని రకాల డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రపరిచి, మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రెయిన్ల శుభ్రతపై ప్రత్యేక మానిటరింగ్ నిర్వహించాలని అధికారులకు తెలిపారు. అలాగే మూడవ వారంలో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, మార్కెట్లు, రైతు బజార్లలో ఎక్కువ మొత్తంలో చెత్త ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యాపారులు రోడ్లపై చెత్త వేయకుండా ప్రత్యేక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు. ఆన్-సైట్ కంపోస్టింగ్, బయోడైజెస్టర్ ప్లాంట్ల వినియోగంపై కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు అడ్వైజరీ నోట్లు జారీ చేయాలని పేర్కొన్నారు.
చివరిగా నాల్గవ వారంలో అన్ని పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు, పాత చెత్త నిల్వ కేంద్రాలు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు, ఖాళీ స్థలాలను పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నాలుగు వారాల కార్యక్రమంలో చేపట్టిన పనులన్నింటినీ సమగ్రంగా క్రోడీకరించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు, అధికారిక కార్యక్రమాల సమయంలో జిల్లాలో చేపట్టిన పరిశుభ్రత చర్యలు ప్రతిష్ఠాత్మకంగా కనిపించేలా ఉండాలని అన్నారు. పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు, జడ్జీలు రానున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, ప్రతి ప్రాంతంలో పరిశుభ్రత స్పష్టంగా కనిపించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
