Amaravati Health Research Center | మంగళగిరిలో ఎన్‌సీడీసీ సేవలకు శ్రీకారం

Amaravati Health Research Center | మంగళగిరిలో ఎన్‌సీడీసీ సేవలకు శ్రీకారం

Amaravati Health Research Center | వైరస్‌ల గుట్టు విప్పనున్న అత్యాధునిక ల్యాబ్లు
అంటువ్యాధుల నియంత్రణలో కీలక పాత్ర
ఢిల్లీ, పుణేలతో పనిలేకుండా ఏపీలోనే పరీక్షలు
ప్రజారోగ్య రక్షణకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ

Amaravati Health Research Center | అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి సిగలో మరో జాతీయ స్థాయి ఆరోగ్య పరిశోధన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇప్పటికే ఎయిమ్స్ తన సేవలతో అందరికీ చేరువవగా, ఇదే ఎయిమ్స్‌కు కూతవేటు దూరంలో మరో అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) తన సేవా ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.

ప్రజారోగ్యానికి సవాల్ విసిరే వైరస్‌ల గుట్టు రట్టు చేయడంతో పాటు అంతుచిక్కని వ్యాధుల మూలాలను ఛేదించడమే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేయనుంది. మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీడీసీని నెలకొల్పారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్‌సీడీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంటువ్యాధుల సంక్రమణను గుర్తించి, వాటిని అరికట్టే లక్ష్యంతో ముందస్తు హెచ్చరికల వ్యవస్థగా ఈ పరిశోధన కేంద్రం పనిచేస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు, కీటక జనిత వ్యాధులపై పరిశోధనలతో ప్రజారోగ్య రక్షణలో కీలక భూమిక పోషించనుంది.

ప్రస్తుతం మంగళగిరిలోని నూతన భవనంలో ఈ సంస్థ తన కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించనుంది. అత్యాధునిక ల్యాబ్ వసతులు సమకూర్చనున్నారు.

ఎన్‌సీడీసీ ఏం చేస్తుందంటే…

ఎక్కడైనా అసాధారణ రీతిలో వ్యాధులు సంభవిస్తే ఇక్కడి నిపుణులు క్షేత్ర స్థాయికి చేరుకుని పరిస్థితిపై అంచనా వేస్తారు. జిల్లాల వారీగా ఏఏ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయో గుర్తిస్తారు. ఎయిమ్స్, ఇతర ప్రధాన ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తారు.

గాలి, నీరు, కీటకాలు, మట్టి ద్వారా వచ్చే వ్యాధులపై నిరంతర నిఘా ఉంచి, పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌సీడీసీ స్పందిస్తుంది. ప్రమాదకర వైరల్ వ్యాధి ఎల్లో ఫీవర్ లాంటివి వ్యాపించకుండా 400 మీటర్ల పరిధిలో వెక్టర్ ఫ్రీ జోన్ ఏర్పాటు చేస్తుంది.అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించే శంషాబాద్, విశాఖపట్నం విమానాశ్రయాలతో పాటు విశాఖ ఓడరేవుపై ఎన్‌సీడీసీ పర్యవేక్షిస్తుంది.

ఢిల్లీ, పుణేలతో పనిలేదిక

గతంలో కరోనా లాంటి కొత్త వైరస్‌లు వచ్చినప్పుడు వాటి నమూనాలు ఢిల్లీ, పుణేకి పంపాల్సి వచ్చేది. నివేదికల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎన్‌సీడీసీ కేంద్రం రాకతో ఆ నిరీక్షణకు తెరపడింది. ఇక్కడ అత్యాధునిక బయో సేఫ్టీ లెవెల్-2 (బీఎస్‌ఎల్-2) ల్యాబ్లు వైరస్‌ల గుట్టు విప్పనున్నాయి. ఈ ల్యాబ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వాటిని నెలకొల్పితే అంటువ్యాధుల మూలాలను కచ్చితత్వంతో ఇక్కడే ఛేదించవచ్చు.

Leave a Reply