మే 31న నంద్యాలలో ‘సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన’..

మే 31న నంద్యాలలో ‘సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన’..
సీమ హక్కుల సాధనకై ప్రజలు, మేధావులు కదిలిరావాలని పిలుపు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ సాగునీటి హక్కుల సాధనే ధ్యేయంగా, ప్రజా చైతన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నెల మే 31న నంద్యాలలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రకటించింది. బుధవారం నంద్యాలలోని సమితి కార్యాలయంలో ఉపాధ్యక్షులు యర్రం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.వారు మాట్లాడుతూ 2016 మే 31న సుమారు 30 వెల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నిర్వహించిన ‘సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన’ ఉద్యమం ఒక చరిత్ర సృష్టించిందన్నారు.
ఈ చారిత్రాత్మక ఘట్టానికి దశాబ్దం పూర్తయినప్పటికీ, రాయలసీమకు జరగాల్సిన న్యాయం ఇంకా జరగలేదన్నారు. ఈ మహాసభ కేవలం ఒక వేడుక కాదు, సీమ ఆత్మగౌరవ గర్జన అని, హక్కుల సాధనకై సాగే మరో సంకల్ప ఘడియ అని స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రాయలసీమలోని 90 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిలో.. 22 లక్షల ఎకరాలకు సాగునీటి హక్కులు ఉన్నాయన్నారు . పాలకుల నిర్లక్ష్యం, అసంపూర్ణ ప్రాజెక్టుల వల్ల నేడు కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందన్నారు. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, హైకోర్టు ఏర్పాటు, కడప ఉక్కు కర్మాగారం, అనంతపురం ఏయిమ్స్ , సీడ్, హార్టికల్చర్ హబ్‌లు, జాతీయ స్థాయి విద్యా-వైద్య సంస్థలు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు ఇప్పటికీ కేవలం హామీలుగానే మిగిలిపోయాయన్నారు.
మే 31న జరిగే ఈ మహాసభకు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న రైతులు, యువత, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గ సభ్యులు ఏరువ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, మనోజ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
