దేశవ్యాప్తంగా మెరిసిన ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ..

దేశవ్యాప్తంగా మెరిసిన ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ..

ఫేమ్ ఇండియా జాతీయ సర్వేలో ఉత్తమ జిల్లా మేజిస్ట్రేట్ల జాబితాలో స్థానం..
పరిపాలనలో వినూత్నత.. ప్రజలకు చేరువైన పాలనకు గుర్తింపు
ఎన్టీఆర్ జిల్లాకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ తీసుకొచ్చిన యువ ఐఏఎస్ అధికారి..

ఆంధ్రప్రభ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పరిపాలనకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ రేటింగ్ మ్యాగజైన్ ఫేమ్ ఇండియా, ఆసియ పోస్ట్ సంయుక్తంగా నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి . లక్ష్మీశ దేశంలోని “ఉత్తమ, అత్యుత్తమ పనితీరు కనబర్చిన జిల్లా మేజిస్ట్రేట్లు” జాబితాలో చోటు సంపాదించారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 జిల్లాల పరిపాలనా వ్యవస్థలను పరిశీలించి రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో లక్ష్మీశ ఎంపిక కావడం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపింది.

.. స్పందనలో వేగం..

ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం, పాలనలో పారదర్శకత, సంక్షేమ పథకాల అమలులో క్రమశిక్షణ, సాంకేతికత వినియోగంతో సేవలను ప్రజలకు చేరువ చేయడంలో చూపిన చొరవ తీసుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి శ కు ఈ గుర్తింపును తీసుకొచ్చిన ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలో పౌర సేవలు, రెవెన్యూ వ్యవస్థ, వరదల నివారణ చర్యలు, ప్రజా వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన తీరు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా కలెక్టర్ లక్ష్మీశ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ చర్యలు చేపట్టడం ఆయన పరిపాలనకు ప్రత్యేకతగా మారింది. పలు ప్రభుత్వ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన చూపిన నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలను సైతం అందుకుంది.

.. అందరి అభిప్రాయాలతో..

ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ నిర్వహించిన ఈ సర్వేలో నిపుణుల అభిప్రాయాలు, గ్రౌండ్ రిపోర్టులు, మీడియా విశ్లేషణలను ఆధారంగా తీసుకుని దేశంలోని 100 మంది ఉత్తమ జిల్లా మేజిస్ట్రేట్లను ఎంపిక చేశారు. వీరిలో అత్యంత విశిష్ట సేవలు అందించిన 25 మంది అధికారులను 2026 ప్రత్యేక సంచికలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ . తమిమ్ అన్సారీ , కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ లతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్ ఎంపిక కావడం రాష్ట్ర పరిపాలనా ప్రతిష్ఠను మరింత పెంచిందని అధికారులు పేర్కొంటున్నారు.

.. అభినందనల వెల్లువ…

జిల్లాకు జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన కలెక్టర్ లక్ష్మీశ్కు ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు. జిల్లా ప్రతిష్టను మరోసారి జాతీయస్థాయిలో కి తీసుకువెళ్లి అత్యుత్తమ అధికారిగా గుర్తింపు పొందడం సంతోషదాయకమని అంటున్నారు.

Leave a Reply