కర్మయోగి చేంజ్ మేనేజ్‌మెంట్ శిక్షణకు కమిషనర్..

కర్మయోగి చేంజ్ మేనేజ్‌మెంట్ శిక్షణకు కమిషనర్..
- హైదరాబాద్‌లో 5 రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హైదరాబాద్‌లో నిర్వహించనున్న “కర్మయోగి చేంజ్ మేనేజ్‌మెంట్ ఫర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్లారు. దీంతో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణకి ఇంచార్జీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.978 మేరకు మే 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు, సీనియర్ నాన్-ఐఏఎస్ అధికారులతో పాటు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ సి. ఓబులేసు కూడా ఈ శిక్షణలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.
ఈ శిక్షణలో పరిపాలనలో మార్పుల నిర్వహణ, ప్రజలకు వేగవంతమైన సేవల అందజేత, నిర్ణయాల్లో సమర్థత, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి, సాంకేతిక వినియోగం, బాధ్యతాయుత పాలన వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు.
ఈ శిక్షణ ద్వారా నగరపాలనలో మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
