అంబులెన్స్‌పై చెట్టు కూలినా తృటిలో తప్పిన ప్రమాదం..

అంబులెన్స్‌పై చెట్టు కూలినా తృటిలో తప్పిన ప్రమాదం..

స్వల్ప గాయాలతో బయటపడిన పేషెంట్‌, బంధువులు, డ్రైవర్‌..
అప్రమత్తంగా మరో వాహనంలో వరంగల్‌కు తరలింపు..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో శనివారం ఉదయం అంబులెన్స్‌పై చెట్టు కూలిన ఘటన కలకలం రేపింది. నర్సంపేట నుంచి ఓ పేషెంట్‌ను మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఉన్నవారు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోగిని అంబులెన్స్‌లో వరంగల్‌కు తీసుకెళ్తుండగా లక్నేపల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న పెద్ద చెట్టు ఒక్కసారిగా విరిగి అంబులెన్స్‌పై పడింది. దీంతో వాహనం ముందు భాగం దెబ్బతినగా, అందులో ఉన్న పేషెంట్‌, బంధువులు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం పేషెంట్‌ను మరో వాహనంలో వరంగల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ ఘటనతో కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించిన అనంతరం రాకపోకలు పునరుద్ధరించారు. ప్రమాదం తీవ్రంగా మారకుండా అందరూ క్షేమంగా బయటపడటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply