ఆర్టీసీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం తగదు..

ఆర్టీసీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం తగదు..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు శనివారం ఖండించారు. తాను ఇటీవల మీడియాతో మాట్లాడిన అంశాలను కొంత మంది ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కొనకళ్ల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్టీసీలలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతగా 750 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విధానంలో భాగంగా పెట్టుబడులు, నిర్వహణ, డ్రైవర్ల నియామకం వంటి అంశాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయని, అదే విషయాన్ని తాను మీడియాకు వివరించానని చెప్పారు. అయితే కొంత మంది తన వ్యాఖ్యలను వక్రీకరించి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మరోసారి స్పష్టం చేసిన కొనకళ్ల, ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కొనకళ్ల నారాయణరావు ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
