Traffic Rules | ట్రాఫిక్ నియంత్రణకు.. నయా రూల్స్

Traffic Rules | ట్రాఫిక్ నియంత్రణకు.. నయా రూల్స్
Traffic Rules | కొత్త పార్కింగ్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం
ఇక రోడ్డుపై వాహనం పార్కింగ్ చేస్తే చుక్కలే..
వాహనం నిలిచిపోయినా భారీ జరిమానా
అలాగే వేలల్లో టోయింగ్ చార్జీల మోత
సీజ్ చేసిన వాహనాన్ని విడిపించాలంటే ఇక కష్టమే
Traffic Rules | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ప్రధాన రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపడం, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను రోజుల తరబడి రోడ్లపైన వదిలేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామవడమే కాకుండా, ఊహించని రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక సమగ్రమైన కొత్త పార్కింగ్ పాలసీని సిద్ధం చేసింది.
ఈ కొత్త విధానానికి సంబంధించిన ముసాయిదాను రవాణా శాఖ ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ కఠిన నిబంధనలను రూపొందించారు. ప్రభుత్వం నుంచి ప్రాథమిక ఆమోదం లభించిన తర్వాత, ఈ ముసాయిదాపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ పాలసీ అధికారికంగా అమల్లోకి రానుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాల మోత..
కొత్త విధానం అమల్లోకి వస్తే, రహదారులపై వాహనాలను ఇష్టారాజ్యంగా వదిలివెళ్లే వారికి భారీగా ఖర్చవుతుంది. ఇప్పటివరకు కేవలం ‘నో పార్కింగ్’ జరిమానా కట్టి వాహనాన్ని విడిపించుకునే వెసులుబాటు ఉండేది, కానీ ఇకపై పరిస్థితి మారనుంది. వాహనాన్ని తరలించడానికి అయ్యే ‘టోయింగ్’ ఛార్జీలను వాహనదారే భరించాలి. అంతేకాకుండా, వాహనాన్ని యార్డులో భద్రపరిచినందుకు గాను, రోజువారీ ప్రాతిపదికన పార్కింగ్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
వాహనాన్ని విడిపించుకోవాలంటే చిక్కులే..
వాహనాన్ని విడిపించుకోవాలంటే కేవలం పార్కింగ్ ఫీజు మాత్రమే సరిపోదు. ఆ వాహనంపై పెండింగ్‌లో ఉన్న పాత చలాన్లు, రోడ్ ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా వంటివన్నీ సక్రమంగా ఉంటేనే అధికారులు వాహనాన్ని అప్పగిస్తారు. ఒకవేళ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని 30 నుంచి 45 రోజులలోపు యజమాని క్లెయిమ్ చేయకపోతే, ఆ వాహనాన్ని వేలం వేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.
పీపీపీ విధానంలో ఆధునిక పార్కింగ్ యార్డులు
ముసాయిదా నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న వాహనాలు, ఫుట్‌పాత్‌లపై నిలిపినవి, నో-పార్కింగ్ జోన్లలో ఉన్న వాహనాలను తక్షణమే టోయింగ్ చేస్తారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాలను ఉంచడానికి పోలీస్ స్టేషన్లలో లేదా రవాణా కార్యాలయాల్లో తగినంత స్థలం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది.
ప్రజలకు దబిడి దిబిడే
దీనికి తోడు రోజువారీ పార్కింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి. ద్విచక్ర వాహనాలకు రోజుకు రూ. 20-30, ఆటోలకు రూ. 35-50, కార్లకు రూ. 60-80, బస్సులకు రూ. 200 నుంచి రూ. 300 వరకు పార్కింగ్ ఫీజుగా చెల్లించాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ కఠిన నిబంధనల ద్వారా రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వాహన రకాన్ని బట్టి, అది నగరమా లేక గ్రామీణ ప్రాంతమా అనే దాన్ని బట్టి టోయింగ్ ఛార్జీలు మారుతుంటాయి. ఉదాహరణకు, నగరాల్లో ద్విచక్ర వాహనాల టోయింగ్‌కు రూ. 500 వరకు చార్జీ చేసే అవకాశం ఉంది
వాహనాల వారీగా టోయింగ్ చార్జీలు
వాహన రకం నగర/పట్టణ ప్రాంతాల్లో (రూ.) గ్రామీణ ప్రాంతాల్లో (రూ.)
బైక్స్ 500 300
ఆటో రిక్షాలు 700 500
కార్లు 1,000 700
బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు 4,000 2,500
భారీ గూడ్స్ వాహనాలు 5,000 3,500
