టీజీ జన్మదిన వేడుకల్లో భాగంగా 60 జంటలకు వివాహ కానుకలు

టీజీ జన్మదిన వేడుకల్లో భాగంగా 60 జంటలకు వివాహ కానుకలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ రాజ్యసభ సభ్యులు పీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 16న వివాహ బంధంతో ఒక్కటుకానున్న 60 జంటలకు వివాహ కానుకలను అందజేశారు. కర్నూలులోని టీజీ వెంకటేష్ స్వగృహంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వధూవరులకు పట్టు వస్త్రాలు, బంగారు తాళిబొట్లు, కాళీ మెట్టెలను పంపిణీ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోనున్న జంటలకు టీజీ కుటుంబ సభ్యులు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ సతీమణి రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరై నూతన వధూవరులకు వివాహ కానుకలను అందజేశారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ వివాహ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి జంటకు రూ.80 వేల నగదు, రూ.20 వేల విలువైన బంగారు తాళిబొట్టు, కాళీ మెట్టెలతో పాటు పట్టు వస్త్రాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీవీవీ ట్రస్ట్ మ్యారేజెస్ కోఆర్డినేటర్లు వాయుగండ్ల సుబ్బారావు, దాశెట్టి శ్రీనివాసులు, విటల్ శెట్టి, ఉమామహేశ్వరరావు, జవహర్ బాబు పాల్గొన్నారు. నూతన వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై టీజీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
