పర్యటనల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

పర్యటనల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, కేంద్ర రక్షణ శాఖ మంత్రి Rajnath Singh పుట్టపర్తి పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ సెక్టార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలు, కాన్వాయ్ రూట్లలో అమలు చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను ముందస్తుగా పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, విఐపీ, వివిఐపీ వాహనాలు, ప్రజల వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలోని ప్రవేశ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

సభా ఏర్పాట్ల పరిశీలన..
సభా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, ఇంచార్జ్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు, వివిఐపీ, వీఐపీ ఎంట్రీలు, పార్కింగ్ ప్రాంతాలు, భారీ కేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సభా ప్రాంతంలో విఐపీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటనకు పటిష్ట భద్రత..
ఈ నెల 14న రాష్ట్ర మంత్రి Nara Lokesh పర్యటన నేపథ్యంలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా మధ్యాహ్నం 2.50 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకునే మంత్రి, అనంతరం కాన్వాయ్ ద్వారా బత్తలపల్లిలోని ఆర్‌డీటీ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, కాన్వాయ్ మార్గం, విధుల్లో పాల్గొనే సిబ్బంది రాకపోకలకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, డీఎస్పీలు నరసింగప్ప, శివన్నారాయణస్వామి, కేవీ మహేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు సంబంధిత సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
