బంద్ పిలుపు నేపథ్యంలో ముందస్తు అరెస్టు..

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇటీవల గంగుల క్యాంపు కార్యాలయం పై బీజేపీ నాయకుల దాడిని నిరసిస్తూ బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా శాఖ నేడు నగర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు నగరంలోని టవర్ సర్కిల్ లో బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండాలని ఎమ్మెల్యే గంగులను ఇంట్లోనే అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు.

నగరంలో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసులను పహరా నిర్వహిస్తుండగా గంగుల కమలాకర్ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయం అని..మమ్మల్ని అడ్డుకున్న కానీ నగర ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారని అన్నారు. పోలీసులు మా పై పెట్టే దృష్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా ఉంటే మా కార్యాలయం పై దాడి జరిగేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడాలని కోరారు.