వేధింపులకు విసిగిన మహిళ ప్రతిఘటన…
వేధింపులకు విసిగిన మహిళ ప్రతిఘటన…
వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన వివాహిత..
గ్రామస్తుల దేహశుద్ధి.
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని అరికెర గ్రామంలో మహిళపై వేధింపుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని బాధిత మహిళ బహిరంగంగా చెప్పుతో కొట్టగా, అనంతరం ఆగ్రహించిన గ్రామస్తులు అతనిపై దాడి చేసి గుండు గీయించి ఊరేగించిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, రాజశేఖర్ అనే వ్యక్తి గ్రామానికి వచ్చిన 32 ఏళ్ల వివాహితను గత కొద్ది రోజులుగా వెంబడిస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక కోరికలు తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేశాడని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం కూడా మహిళను అడ్డగించి బలవంతంగా చేయి పట్టుకున్నాడని ఆరోపిస్తూ, ఆగ్రహించిన మహిళ అతడిని చెప్పుతో కొట్టింది. అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో అతని తలలో సగం భాగం గుండు గీయించి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పత్తికొండ డీఎస్పీ బి. వెంకట రామయ్య తెలిపారు. మహిళలపై వేధింపుల విషయంలో కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కూడా సరైంది కాదని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు సామాజిక చర్చకు దారితీస్తుండగా, మహిళల భద్రత, చట్టపరమైన అవగాహనపై మరింత దృష్టి అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
