1stMaychintana | బుద్ధ పూర్ణిమ ప్రత్యేకం

1stMaychintana | బుద్ధ పూర్ణిమ ప్రత్యేకం

1stMaychintana | బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత
బుద్ధుని జీవితం మరియు జ్ఞానోదయం
నాలుగు ఆర్య సత్యాలు – జీవన మార్గదర్శి
అశోక చక్రవర్తిపై బౌద్ధ ప్రభావం
నేటి ప్రపంచంలో బుద్ధుని బోధనలు

1stMaychintana | పవిత్రమైన చిత్ర పౌర్ణమి సందర్భంగా, ఆలయ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లోనూ ఐశ్వర్యం వృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను. సోదరీసోదరులందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచానికి భారత్ అందించిన అనేక బహుమతుల్లో బౌద్ధమతం ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది జీవితాల్లో బుద్ధ భగవానుని బోధనలు వెలుగులు నింపుతూనే ఉన్నాయి.

స్వీయ వికాస ప్రాధాన్యంను ప్రపంచానికి భారత్ నేర్పించింది. “బుద్ధ” అనే పదానికి “జ్ఞానోదయం పొందిన వాడు” అని అర్థం. మానవాళిని ఆత్మజ్ఞానం, స్వీయ జాగరూకత దిశగా నడిపించడానికి కృషి చేసిన ఈ మహనీయుడు జన్మించడం, ఆయనకు జ్ఞానోదయం కావడం ఒకే రోజున జరగడం విశేషం. యువరాజు సిద్ధార్థుడు విలాసవంతంగా పెరిగారు. 29 ఏళ్ల వయసులో రాజభవనాన్ని, భార్యను, కుమారుణ్ని, సమస్త లౌకిక సంపదలను త్యజించి, ఆధ్యాత్మిక సత్యాన్వేషణకు బయలుదేరారు. ఆరేళ్ల పాటు తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత బోధగయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారారు.

నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం, నైతిక ప్రవర్తనా మార్గం కొత్త తత్వానికి నాంది పలికాయి. ఇది భారత్ గర్వపడేలా ప్రపంచ చరిత్రలో వికసించింది. వారణాసి సమీపంలోని సారనాథ్ వద్ద అయిదుగురు సన్యాసులకు బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. “ధర్మచక్ర పరివర్తన”గా ప్రసిద్ధి చెందిన ఈ బోధన బౌద్ధమతానికి పునాది వేసింది. దాని అధికారిక ప్రారంభాన్ని సూచించింది. కాలక్రమేణా ఆయన బోధనలకు అనేక మంది ఆకర్షితులయ్యారు. రాజగృహంలోని వేణువనం విహారాన్ని మగధ రాజు బింబిసారుడు దానం చేశారు. ధనవంతుడైన అనాథపిండికుడు విహారాన్ని నిర్మించేందుకు మొత్తం జేతవనాన్ని బంగారు నాణేలతో నింపించాడు. భారత ధర్మచింతన పట్ల ఉన్న గాఢమైన విశ్వాసంను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయి.

నాలుగు ఆర్య సత్యాలను విహారాలు ప్రచారం చేశాయి. కోరికే దుఃఖానికి కారణం, కోరికలను అంతం చేయడం ద్వారా దుఃఖాన్ని అధిగమించవచ్చు, అష్టాంగ మార్గాన్ని అనుసరించడమే దుఃఖ నివారణకు మార్గం అనే అంశాలు అందులో ఉన్నాయి. బుద్ధుడి ఉపదేశం: గతాన్ని తలుచుకోవద్దు—వర్తమానంలో జీవించండి. సత్యసంధత శక్తిమంతమైనది. మనసే అన్ని కర్మలకు మూలం. కాబట్టి సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవాలి. కష్టసమయాల్లో భయంతో వెనకడుగు వేయవద్దు. జీవిత ప్రయాణం అంతిమంగా వ్యక్తిగతం. దానిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించండి. మాటలు గాయపరుస్తాయి. కాబట్టి మృదువుగా మాట్లాడండి. ప్రేమ, అహింస అవసరం. నిత్యవిద్యార్థిగా ఉండండి. ఎన్నడూ ఆగిపోవద్దు.

మణిమేఖలై, కుండలకేసి లాంటి తమిళ సాహిత్య గ్రంథాలు బుద్ధుని తత్వాన్ని అందంగా ఆవిష్కరించాయి. అనేక గ్రంథాలు కనుమరుగైపోయినప్పటికీ, అవి అందించిన సేవలు అమూల్యం. “వివేకాన్ని మబ్బులా కమ్మేసే మత్తు పానీయాన్ని, జీవహింసను అజ్ఞానం నుంచి విముక్తులైన వారు విస్మరిస్తారు. జననమరణాలు పునరావృతమవుతాయి. అవి నిద్రపోవడం, నిద్రలేవడం లాంటివి. ఇదే సత్యం. సత్కర్మలు చేసేవారు ఉన్నత లోకాలను పొందుతారు. చెడు కర్మలు చేసేవారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. దీనిని గ్రహించిన వారు తమ బంధాలను విడిచిపెడతారు.” ఇలా బౌద్ధమత సారాన్ని మణిమేఖలై వివరిస్తుంది.

అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం అనే పంచ నైతిక సూత్రాలకు ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు. మతానికి అతీతంగా మనసే అన్నింటికీ మూలమని, సానుకూల ఆలోచనలు, చర్యలు సామరస్యపూర్వక జీవితానికి దారితీస్తాయని బోధించారు. కలత చెందిన మనసులకు స్పష్టత, జ్ఞానోదయం అందించడం వల్ల ఆయన్ను “ఆసియా జ్యోతి”గా కీర్తిస్తారు.

“భగవాన్ గౌతమ బుద్ధుని జీవిత సందేశం ప్రస్తుత కాలానికీ వర్తిస్తుంది. శాంతి మనతోనే మొదలవుతుందని ఆయన బోధించారు. మనల్ని మనం జయించుకోవడమే గొప్ప విజయం అని ఆయన మనకు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచం ఉద్రిక్తతలు, సంఘర్షణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బుద్ధ భగవానుని బోధనలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి” అని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలను నేను గుర్తు చేస్తున్నాను.

యుద్ధకాంక్షతో రగిలిన అశోక చక్రవర్తిని శాంతికి ప్రతినిధిగా మలచడంలోనే బుద్ధుడి బోధనల పరివర్తన శక్తి తేటతెల్లమవుతోంది. అశోక చక్రవర్తి తన రాజ్యమంతటా శాసనాలు, స్తూపాల ద్వారా బౌద్ధ సూత్రాలను ప్రచారం చేశారు. సాంచీ, సారనాథ్‌లోని స్తూపాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ముగ్ధులను చేస్తున్నాయి. బౌద్ధ భిక్షువులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆసియా వ్యాప్తంగా అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశారు. ఆయన కుమారుడు మహేంద్రుడు బుద్ధుడి బోధనలను శ్రీలంకకు చేరవేశారని మహావంశ గ్రంథం చెబుతోంది. తమిళనాడులోనూ బౌద్ధ భిక్షువులు ఈ ధర్మాన్ని ప్రచారం చేశారంటారు. ఆ ప్రాంతంలోని అనేక చోట్ల నేటికీ బౌద్ధ ధర్మ జాడలు కనిపిస్తున్నాయి.

బౌద్ధ భిక్షువులు ఎలాంటి వివక్ష లేకుండా ఉచిత విద్య, వైద్య సేవలను అందించారు. త్రిపిటకాల వంటి పవిత్ర గ్రంథాలను బోధించడంతో పాటు జాతక కథలనూ చెప్పేవారు. అలాగే ప్రజల్లో జాగరూకత, ఏకాగ్రత పెంచేలా ధ్యాన ప్రక్రియల్లో మార్గనిర్దేశం చేసేవారు. దాతృత్వం, ముఖ్యంగా పేదలకు అన్నదానాన్ని ప్రథమ ధర్మంగా పరిగణించేవారు. అన్నార్తుల ఆకలి తీర్చడం అంటే వారికి ప్రాణం పోయడమేనని తమిళ సాహిత్యం చెబుతోంది. విభిన్న ఆధ్యాత్మిక భావనలు, తాత్విక చింతనలు వేల ఏళ్లుగా ఈ గడ్డపై వికసించాయి.

బౌద్ధ ధర్మం భారీ స్థాయిలో విద్యాసంస్థలను, గ్రంథాలయాలను నెలకొల్పింది. నలంద విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా విరాజిల్లింది. “ప్రేమే ఆనందానికి మూలం. ప్రేమే ప్రపంచానికి వెలుగు. ప్రేమ శక్తే అత్యున్నతం” — బుద్ధుడి ఈ బోధనలు నేటికీ ప్రాసంగికంగా నిలిచాయి. ప్రపంచమంతటా ప్రేమ, శాంతి వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

Leave a Reply