వక్ఫ్, దేవాదాయ భూములను రక్షించాలి…

వక్ఫ్, దేవాదాయ భూములను రక్షించాలి…
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు… మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వక్ఫ్, ఎండోమెంట్ భూముల పరిరక్షణ పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్, దేవాదాయ భూములలో అక్రమ కట్టడాలు లాంటివి జరగకుండా ఫెన్సింగ్ వేయించి, బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వక్ఫ్, దేవాదాయ భూముల సర్వే నెంబర్ ల వివరాలను జిల్లా రిజిస్ట్రార్‌కు, సబ్ రిజిస్ట్రార్లకు పంపించాలని తద్వారా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిషేధిత జాబితాలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా వక్ఫ్ భూమిలో నిర్మాణాలు ఏమైనా చేపడితే ముందుగా వారికి నోటీస్ లు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.
అదే విధంగా అటువంటి నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ కట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ ఖాళీ స్థలాల్లో న్యాచురల్ ఫెన్సింగ్ వేయాలని, మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్, దేవాదాయ భూములపై దృష్టి సారించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.. భూములను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.. భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలోనూ నియమ నిబంధనలను పాటించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ లను ఆదేశించారు..
దేవాదాయ శాఖకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూములను కూడా వెబ్ ల్యాండ్‌లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 22,000 ఎకరాలకు సంబంధించి రీకాన్సిలేషన్ ప్రక్రియ సాగుతోందన్నారు. ఇందులో ఇప్పటికే 12,000 ఎకరాల పని పూర్తయిందని, డబుల్ ఎంట్రీలు ఉన్న 3,500 ఎకరాలను తొలగించామని కలెక్టర్ పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, ఆన్లైన్ ద్వారా ఆర్డీవోలు,మునిసిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు..
