Rs 900 cr | వారం వారం రేటు పైపైకి..

Rs 900 cr | వారం వారం రేటు పైపైకి..
ప్రజలపై.. పెట్రో భారం!
ధరల పెంపునకు కేంద్రం ఓకే!?
లీటర్‌కు రూ.25 నుంచి రూ.28 పెంచే చాన్స్
ఐదు రాష్ట్రాల్లో రేపటితో ముగియనున్న ఎన్నికలు
ధరల పెంపునకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం
ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు రోజూ రూ.1,750 కోట్ల భారం
ఆయిల్ ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు పైపైకే
Rs 900 cr | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక భారాన్ని, నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నష్టాలు భరించలేనంతగా మారాయి. ధరలు పెంచుతాం అనుమతి ఇవ్వండని కేంద్రానికి ప్రభుత్వ రంగ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన మూడు సంస్థలు నెల రోజులుగా మొర పెట్టుకుంటున్నాయి. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంపునకు నో చెప్పింది.. పెట్రో, డీజిల్ ధరలు పెంచితే వ్యతిరేక ఓటు భయంతో అనుమతి నిరాకరించింది. కాగా, ఆయా కంపెనీలకు మాత్రం లీటకు 10 రూపాయిలు డ్యూటీలో మినహాయింపు ఇచ్చింది.. ఇదే సమయంలో విమానాలకు వినియోగించే స్పీడ్ ఆయిలు ధరలను 30 నుంచి 40 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో జెట్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి.. ఆ మోతను విమానయాన కంపెనీలు ప్రయాణికులపై బాదేశాయి.
Rs 900 cr | రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ
ఇక రేపటితో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.. చివరి విడత పోలింగ్ రేపు పశ్చిమ బెంగాల్లో జరగనుంది.. ఇప్పటి వరకు ఎన్నికల పేరుతో ధరల పెంపునకు నో చెప్పిన కేంద్రం.. ఇక రేట్లు పేంచేందుకు సిద్ధమైందనే వార్తలు వినవస్తున్నాయి. ఈ ధరల పెంపుపై ఇప్పటికే హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్‌కు కేంద్రం సమాచారం ఇచ్చింది.. ఒకేసారి ధరల భారం మోపకుండా వారం వారం ధరలలో మార్పు చేయాలని సూచించింది. గతంలో రోజూ ధరల మార్పు పద్ధతిని అనుసరించిన కంపెనీలు ఇప్పుడు వారం వారం ధరల భారం మోపేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈసారి ఏకంగా లీటర్‌కు 25 నుంచి 28 రూపాయిల వరకు పెట్రో బాదుడు ఉంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.

Rs 900 cr | ఎందుకీ సంక్షోభం?
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ క్రూడ్ సరఫరాను దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 120 డాలర్ల వద్ద కొనసాగుతుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడం, ఆటంకాలు జరగడం వల్ల మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. యుద్ధ మేఘాల మధ్య సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ధరలను పెంచకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలపై నెలకు 270 బిలియన్ల అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పది రూపాయలు తగ్గించినప్పటికీ అది ఈ నష్టాలను భర్తీ చేయడానికి సరిపోవడం లేదు. భారత్ తన ఆయిల్ దిగుమతులను 13-15 శాతం తగ్గించుకున్నప్పటికీ, పెరిగిన ధరల వల్ల రోజూ అదనంగా ₹1,600 కోట్ల నుంచి రూ.1,750 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలింది.
Rs 900 cr | కోట్లలో నష్టాలు..
ఇక్కడ ఆందోళనకరమైన విషయం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల నష్టాలు. ప్రస్తుతం చమురు కంపెనీలు ప్రతి నెలా అక్షరాలా రూ.27వేల కోట్లు నష్టపోతున్నాయి. అంటే రోజుకు సుమారు రూ.900 కోట్లు అన్నమాట. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించినా, విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు వేసినా.. ఈ భారీ నష్టాలను సర్థుబాటు చేసుకునేందుకు ఏమాత్రం సరిపోవటం లేదని కంపెనీలు అంటున్నాయి.
భారీ పెంపు తప్పదా…
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది. దీని కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు పెంచాల్సి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.94–96 మధ్య ఉండగా.. ఈ పెంపు అమలైతే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.120 మార్కును దాటిపోతుందని తెలుస్తోంది. ఇక డీజిల్ రేట్లను కూడా కేంద్రం భారీగానే పెంచుతుందని అంచనాలున్నాయి.
సామాన్యుడిపై ప్రభావం..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లుగా కాకుండా.. ఎన్నికలు ముగిసిన తర్వాత విడతల వారీగా ఉండొచ్చని కోటక్ పేర్కొంది. అయినప్పటికీ పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పప్పులు, కూరగాయల ధరలు భగ్గుమంటాయి. డెలివరీ ఛార్జీల నుంచి ఆటో సెంటర్ డిమాండ్ వరకు అన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంది. మే నెలలో భారతీయుల పర్స్ ఖాళీ అవ్వడం ఖాయమని లెక్కలు హెచ్చరిస్తున్నాయి.
CLICK HERE TO READ MORE : 4to6kgs less | ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత.. అక్రమాలకు అడ్డుకట్ట!
