ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
సుర్వి యాదయ్యగౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అన్నారు. ఈ తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత, దురుద్దేశపూరిత విధానాలను మార్చుకొని బుద్ది తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జీవధార కాళేశ్వరం కేంద్రంగా కుట్రలు, కుతంత్రాలు పన్నాయని, సాంకేతికంగా తలెత్తిన సమస్యను మరమ్మత్తులు చేసి పరిష్కారం చేయకుండా రెండున్నరేళ్లుగా వికృత రాజకీయక్రీడకు పూనుకున్నదన్నారు.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగిందని, ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న కుట్రలను రాజకీయాలకు అతీతంగా తిప్పికొట్టాలని పౌర సమాజానికి యాదయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
