అభివృద్ధి పనులను అడ్డుకుంటే..

అభివృద్ధి పనులను అడ్డుకుంటే..
కుభీర్, ఆంధ్రప్రభ : మండలంలో జరిగే అభివృద్ధి పనులను అడ్డుకునే వారి పై శాఖా పరమైన చర్యలు తప్పవని కుబీర్ తహసిల్దార్ శివరాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రం కుబీర్ లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. బైంసా నుండి మాలేగాంవ్, నిఘ్వ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ. 20 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రెండు వరుసల రహదారి నిర్మాణ పనులకు పల్సి గొర్ల గుట్ట నుండి మొరం తవ్వుతున్నారంటూ కొందరు ఫిర్యాదు చేయడం పై ఆయన మండిపడ్డారు. సదరు కాంట్రాక్టర్ మొరంకు సంబంధించిన అనుమతులు పొంది ఉన్నట్లు తెలిపారు.
ప్రతి రోజు కొందరు దళారులు పనిగట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మొరం తవ్వకాలను ఆపాలంటూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే అక్కడి నుండి మొరం తీసుకెళ్తున్నారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్డు పనులను అడ్డుకోవడం అంటే అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడమేనని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పై శాఖా పరమైన చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

