Telangana | డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం..

Telangana | డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం..

సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్‌కో సీఎండీకి ఆదేశం..
ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టిజన్ల హర్షం!

Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆర్టిజన్ల జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టిజన్ల సమస్యలపై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచిస్తోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన ట్రాన్స్‌కో సీఎండీని ఆదేశించారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా, మానవీయ కోణంలో తక్షణమే పరిష్కరించగలిగే అంశాలపై జేఏసీ నేతలతో చర్చలు జరపాలని ఉన్నతాధికారులకు సూచించారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారులతో చర్చలకు మార్గం సుగమం చేసినందుకు డిప్యూటీ సీఎంకు జేఏసీ కన్వీనర్ సాయిలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. త్వరలోనే ట్రాన్స్‌కో సీఎండీ ఆధ్వర్యంలో జరగబోయే చర్చల్లో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆర్టిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply