Price | ధరాభారం పెరగనుందా?

Price | ధరాభారం పెరగనుందా?
Price | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్లకు పైగా పెరిగాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో పెట్రోలు కొరత ఏర్పడనుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి దేశంలో పెట్రోలు సరఫరాలో ఎలాంటి తీవ్రమైన అంతరాయం లేదని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్రం నుంచి కూడా పదేపదే భరోసా కల్పించే ప్రకటనలు వెలువడుతున్నాయి. భారత్ ముందస్తు చర్యలుగా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవడం, ఇప్పటికే ఉన్న నిల్వలను వినియోగంలోకి తేవ్వడం ద్వారా పరిస్థితిని చేయిదాటి పోకుండా నియంత్రిస్తోంది.
అయితే ధరల విషయంలో మాత్రం కాస్త ముందు జాగ్రత్త అవసరమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కేంద్రం పన్నుల సర్దుబాటు, ఎగుమతి సుంకాల మార్పులతో ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అందుకే ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తాత్కాలికంగా స్థిరంగానే ఉన్నాయి.
ఇక భవిష్యత్తు పరిస్థితులపై కీలక అంశం హార్ముజ్ జలసంధి పరిస్థితి. ప్రపంచ చమురు రవాణాలో అతి పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుండగా, అక్కడ ఉద్రిక్తతలు కొనసాగితే సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో సిం హ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుండటంతో, ప్రపంచ పరిణామాలు నేరుగా భారత్ లోని పెట్రోలు ధరలపై ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం దేశంలో పెట్రోలు కొరత పరిస్థితి లేదు. కానీ ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం ధరలు పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. అందుకే కేంద్రం పరిస్థితిని సునిశితంగా గమనిస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
