అసమానతలపై పోరాటం చేసిన ఫూలే

అసమానతలపై పోరాటం చేసిన ఫూలే
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంటరానితనం, అసమానతలను నిర్మూలించేందుకు మహాత్మ పూలే జీవితాంతం పోరాటం చేశారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్ సంగారెడ్డి సర్కిల్ ఆధ్వర్యంలో రీజినల్ ప్రెసిడెంట్ మునిపల్లి దశరథ్, రీజినల్ సెక్రటరీ బాలకృష్ణ నాయకత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
కొంతమందికే పరిమితమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు శ్రీకారం చుట్టిన మహనీయుడు పూలే అని కొనియాడారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమించిన మహానుభావుడని అభివర్ణించారు.
పూలే చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని, సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
