నేత్రదానంతో ఇద్దరికి చూపునిచ్చిన నాగభూషణం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం (85) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు అఖిలాండేశ్వరి సమాజహితం దృష్ట్యా నేత్రదానం చేయడానికి అంగీకరించారు.
తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో, వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల (ఎల్వీ ప్రసాద్) సిబ్బంది నేత్ర సేకరణ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా కార్నియా సేకరణ చేపట్టారు.
నాగభూషణం నేత్రదానం ద్వారా ఇద్దరు దృష్టి కోల్పోయిన వారికి చూపునందించే అవకాశం లభించడంతో పాటు, నేత్ర వైద్య విద్యకు కూడా తోడ్పడినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోన్రెడ్డి మల్లారెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసి నేత్రదాన సర్టిఫికెట్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోన్రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
