రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?

టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమస్యలపై ధర్నాలు
వంటవార్పు కార్యక్రమాలతో విన్నూత నిరసనలు
ఈ నెల 7వ తేదీన చలో వరంగల్…..మహా ధర్నాకు సన్నాహాలు
కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే సమ్మె తప్పదు
విద్యుత్ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర నాయకుల మద్దతు

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యుత్ రంగంలో విద్యుత్ కార్మికుల సమస్యలను , డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెసైరన్ మోగక తప్పదంటూ జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా విద్యుత్ కార్యాలయాలలో కార్మికులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. ఇదే కోవలో గురువారం బంజారాహిల్స్ సర్కిల్ కార్యాలయం ఎదుట విన్నూత నిరసనగా చేపట్టిన వంటా వార్పు కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా ముఖంగా విద్యుత్ కార్మికులు తమ డిమాండ్ లను తెలిపారు.

ఇందులో.. విద్యా అర్హత ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలి, ఆర్టిసన్ లకు ఏపిఎస్ఈబి సర్వీస్ నియమాల ప్రకారం ( ప్రస్తుతం ఉన్న ఓఅండ్ఎం, సిబ్బంది ) సర్వీస్ నియమాలు అమలు చేయాలి, టిజిఎన్ పిడిసిఎల్, టిజిఎస్పిడిసిఎల్ లో అన్మాన్ సిబ్బంది ని ఆర్టిసన్ గా విలీనం చేసుకోవాలి, 4 విద్యుత్ సంస్థలో డిసెంబర్ 12వ తేదీ 2016 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నవారిని ఆర్టిసన్ గా గుర్తించాలి అంటూ పేర్కొన్నారు.

  • ఏప్రిల్ 7న చలో వరంగల్ :

ఈ సందర్బంగా పలువురు విద్యుత్ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కొనసాగుతున్న నిరసనలు , ధర్నాలు ఉదృతం చేస్తూ తదుపరి కార్యచరణలో భాగంగా ఈ నెల 7వ తేదీన “చలో వరంగల్ ” కార్యక్రమాన్ని చేపడుతూ వరంగల్ లోని టిజిఎన్పిడిసిఎల్ విద్యుత్ భవనం ఎదుట చేపట్టనున్న మహా ధర్నాను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ విద్యుత్ కార్మికులకు పిలుపునిచ్చారు. అప్పటికీ సంబంధిత విద్యుత్ మేనేజ్మెంట్ ఉన్నత అధికారుల నుండి ఎలాంటి పిలుపు రాకపోతే విద్యుత్ కార్మికులందరు సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని అన్నారు .

ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సర్కిల్ జేఏసీ చైర్మన్ కాలే మహేష్, సర్కిల్ కన్వీనర్ దినేష్ గౌడ్, జేఏసీ నాయకులు నాగరత్నం, పుల్లయ్య, రాష్ట్ర జేఏసీ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్ సంఘాలకు చెందిన నాయకులతో పాటు 1535 రాష్ట్ర నాయకులు వజీర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, 1104 యూనియన్ నాయకులు రమేష్, సంతోష్ గౌడ్…. టివిఈయూ హెచ్- 82 నాయకులు బాల్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు సత్యం, రమేష్…టిఆర్వికెఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొని విద్యుత్ కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపారు.

Leave a Reply