SameRates | అర్థమైందా రాజా…

SameRates | అర్థమైందా రాజా…
SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!
ఆ బాంబులు కాస్తా గ్యాసు షార్టేజ్ రూపంలో
కేంద్రం చెప్పేదంతా “గ్యాసే”
SameRates | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ భీభత్సం… హతోస్మి… ఇదీ అదే సబ్జెక్టు స్టోరీనేనా అని అనుకుంటున్నారా? అవును మరి… తప్పదు. ఇప్పుడు ప్రపంచంలోని ఏమూల కథ చెప్పినా ఈ యుద్ధంతోనే మొదలవుతోంది.
ఢిల్లీలో… ఏ గల్లీలో ఎక్కడేం జరిగినా… ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…! ఎందుకంటే అక్కడెక్కడో ఎవరో బాంబులేసుకుని చంపుకుంటుంటే మనమెందుకు పట్టించుకుంటాం?

ఆ బాంబులు కాస్తా గ్యాసు షార్టేజ్ రూపంలో, అన్నిటి ధరల రూపంలో మన మీద వచ్చి పడుతున్నాయి కనుకనే ఈ బాధం.
గ్యాస్ కి కొరత లేదు… పుష్కలంగా ఉంది అని కేంద్రం చెప్పేదంతా “గ్యాసే” అని వాస్తవ పరిస్థితులు సామాన్యులను వెక్కిరిస్తున్నాయి. హోటళ్ళల్లో తిందామంటే జేబులు సహకరించకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు రోడ్లలో పోతూ పోతూ హోటళ్ళ వైపు ఆశగా చూస్తూ, దీర్ఘంగా నిట్టూరుస్తూ అలా అలా సాగిపోతున్నాడు.
ఒకప్పుడైతే ఏదోక హోటల్లో దూరి పోయి ఇష్టమొచ్చింది ఆర్డరిచ్చేసి బిల్లు కట్టేసి బ్రేవ్ మంటూ బయటికొచ్చేవాడు. ఇప్పుడు మాత్రం, మూడు టిఫిన్లకయ్యే ఖర్చు ఇప్పుడు ఒక్క టిఫిన్కే వసూలు చేస్తున్నారు.
అదేమంటే అవును సార్… గ్యాస్ ధర ఎంత పెంచేశారో తెలుసా? అని దీర్ఘాలు తీస్తున్నారు…
ఇలాంటి కరవు కాలంలో సామాన్యుడి దృష్టిని ఆకర్షించింది ఓ హోటలు… కాదు కాదు… ఆ హోటలు ముందున్న బోర్డు.
ఆ బోర్డు మీద ఏం రాసి ఉందో మీరు ఆల్ రెడీ పైన కార్టూన్ లో చూసేసారా కాదా…?
అదన్న మాటే… తన కళ్ళను తానే నమ్మలేక భయం భయంగా లోపలికి వెళ్లి మెనూ పరిశీలించాడు. ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
అనుమానంగా ఓనరు వంక చూశాడు, ఇతడు అడగబోయేదేమిటో కనిపెట్టేసినట్టుగా తల అడ్డంగా ఊపుతూ…
“అవును సార్! ధరలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు” అని చిరునవ్వుతో చెప్పాడు.
మరింకేం… మన సామాన్యుడికి ఆకలి ఆనందం పొంగుకు రాగా ఒక మసాలా దోశ ఆర్డరిచ్చేశాడు.
మరు నిముషంలోనే కుర్రాడు టీ కప్పు కింద ఉండే సాసర్ లాంటీ ప్లేటు పట్టుకొచ్చాడు.
“అదేందిరా ప్లేటు తెచ్చావ్, అందులో దోశేదీ?” అని అడిగాడు.
అందులోకి చూస్తూ అడిగాడు… అందులో మినియేచర్ దోశ ఒకటి కనిపించింది.
“ఇది దోశా?” ఆక్రోషం… అసహనం కలగలిపి గట్టిగా అరిచాడు సామాన్యుడు.
“అవును సార్, దోశే” కూల్ కూల్ గా చెప్పాడు కుర్రాడు.
ఈలోగా పక్కన టేబుల్‌కి “ఇదిగోండి సార్, మీ ఇడ్లీ” అంటూ తెచ్చిచ్చాడు మరో కుర్రాడు. అవి షర్టు బటన్ల సైజులో ప్లేటులో తళుకుతళుకుమంటున్నాయి.
సామాన్యుడికి సీనంతా అర్థమైంది… రేట్లు తగ్గించలేదు సరే, టిఫిన్ల సైజులు కుదించేశారు.
అంటే అంతకు ముందులాగా తినాలంటే కనీసం ఇప్పుడు అయిదారు ప్లేట్లు తినాలి… లేకపోతే వాళ్ళిచ్చింది తిని మూసుకుని బిల్లు కట్టి వెళ్ళి పోవాల్సిందే.
అవును మరి, గ్యాసు ధరైనా మరో భారమైనా వ్యాపారులు ఎందుకు భరిస్తారు? వినియోగదారులే భరించాలి… అర్థమైందా రాజా…
